నెగెటివ్ రివ్యూలపై ఫైర్
సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కృష్ణవంశీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి రివ్యూలు ఇచ్చే వారిలో 90 శాతం మంది మూర్ఖులేనని ఆయన అభివర్ణించారు. కనీసం టికెట్ కూడా కొనకుండా, సినిమాను ఫ్రీగా చూసే వీరు.. సినిమా బాగుందో లేదో తెలియకముందే నెగెటివ్ రివ్యూలతో ప్రేక్షకులను భయపెడుతున్నారని విమర్శించారు. సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలోపే సినిమాపై ఒక తప్పుడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శ్రమను తక్కువ చేయొద్దు
ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టం, కోట్లాది రూపాయల పెట్టుబడి ఉంటుందని కృష్ణవంశీ గుర్తు చేశారు. “సినిమా లేకపోతే మీ బతుకే లేదు.. అలాంటి సినిమానే ఎలా నాశనం చేస్తారు?” అంటూ రివ్యూ రైటర్లను ప్రశ్నించారు. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది కార్మికుల కష్టాన్ని తక్కువ చేసి చూడటం భావ్యం కాదని హితవు పలికారు. రివ్యూల పేరుతో చేస్తున్న ఈ పని సినిమా పరిశ్రమను చంపేయడమేనని ఆయన మండిపడ్డారు.
వారం రోజులు ఆగలేరా?
సినిమా ఫలితం ఏమిటో తేలడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందని, ఆ లోపే విశ్లేషణల పేరుతో హడావిడి చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు తమకు నచ్చిన విధంగా సినిమాను ఆస్వాదించే లోపే, సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించి వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రియేటివ్ మేకింగ్‌కు పేరుగాంచిన కృష్ణవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.









