‘వర్షం’ సినిమాతో పోలిక
రెబల్ స్టార్ ప్రభాస్ వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. తన కెరీర్లో ‘వర్షం’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందించిందో, సంతోష్ శోభన్ కెరీర్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ అంతటి మైలురాయిగా నిలుస్తుందని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. “ఇదొక బ్యూటిఫుల్ ఫిలిం, నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. సంతోష్ – మానస వారణాసి జోడి వండర్ ఫుల్ గా ఉంది” అని ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.
సంతోష్ శోభన్‌తో ఉన్న ప్రత్యేక బంధం
సంతోష్ శోభన్ తండ్రి, దివంగత దర్శకుడు శోభన్, ప్రభాస్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ‘వర్షం’ అందించారు. అప్పటి నుంచే శోభన్ కుటుంబంతో ప్రభాస్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. సంతోష్ శోభన్ హీరోగా మారినప్పటి నుంచి ప్రభాస్ అతనికి వెన్నుముకగా నిలుస్తూ వస్తున్నారు. సంతోష్ నటించిన గత చిత్రాల ప్రమోషన్స్‌లో కూడా ప్రభాస్ పాల్గొని తన మద్దతును తెలిపారు. ఇప్పుడు ‘కపుల్ ఫ్రెండ్లీ’కి పాజిటివ్ టాక్ వస్తుండటం, దానికి ప్రభాస్ ప్రశంసలు తోడవడంతో సినిమాకి మరింత బజ్ ఏర్పడింది.
సినిమా విశేషాలు
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. జీవితంలో ఎలాంటి ఆశలు లేని ఓ యువకుడి లైఫ్ లోకి ఒక అమ్మాయి ప్రవేశించిన తర్వాత జరిగిన మార్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రభాస్ సపోర్ట్ గురించి సంతోష్ శోభన్ స్పందిస్తూ.. “ప్రభాస్ అన్న సినిమాను అప్రిషియేట్ చేసినప్పుడే నేను గెలిచాననే ఫీలింగ్ కలిగింది” అని ఎమోషనల్ అయ్యారు.









