ఉపాధి హామీ పాత చట్టాన్నే కొనసాగించాలని దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 12న కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ పనులు నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కె ఎస్ శ్రీనివాస్ లు డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు ఒక భరోసాను ఇచ్చిందని, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిందని ఇలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాన్ని తెచ్చిందన్నారు.ఈ కొత్త చట్టం పేదల హక్కులను కాలరాస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని కావున కొత్త పథకాన్ని రద్దుచేసి పాత చట్టాన్నే కొనసాగించాలనే డిమాండ్ తో ఫిబ్రవరి 12 న సమ్మె జరుగుతుందన్నారు.









