దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో జరిగిన పొరపాట్ల గురించి మనసు విప్పి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన తన కుమార్తె ఐశ్వర్యను కథానాయికగా పరిచయం చేస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ‘సీతా పయనం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన తన వ్యక్తిగత జీవితం మరియు ఆర్థిక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన కెరీర్ ఆరంభంలో చాలా చిన్న వయసులోనే ఊహించని స్థాయిలో డబ్బు చూశానని, అయితే ఆ సంపాదనను ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డానని అర్జున్ తెలిపారు. తన చుట్టూ ఉన్నవారే తనను నమ్మిస్తూ మోసం చేశారని, దీనివల్ల తాను భారీగా ఆస్తులను నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో పోగొట్టుకున్న ప్రాపర్టీస్ కనుక ఇప్పుడు తన వద్ద ఉండి ఉంటే, తన ఆర్థిక పరిస్థితి మరో రేంజ్ లో ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ముఖ్యంగా దివంగత నటభూషణ్ శోభన్ బాబు గారితో తనకు ఉన్న అనుబంధం గురించి చెబుతూ, ఆయన ఆ రోజుల్లో తనకు ఎన్నో ఆర్థికపరమైన సలహాలు ఇచ్చేవారని అర్జున్ అన్నారు. “శోభన్ బాబు గారు నాకు చాలా క్లోజ్, ఆయన చెప్పిన పెట్టుబడి సూత్రాలు అప్పట్లో నా బుర్రకి ఎక్కలేదు.. ఆయన మాట విని ఉంటే బాగుండేది” అని అర్జున్ పేర్కొన్నారు. తన కుమార్తె కోసం తెరకెక్కించిన ‘సీతా పయనం’ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.









