ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో పాటు ఆకట్టుకునే అందంతో ప్రేక్షకుల మనసు దోచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మాయ మాల్, దర్శకుడు, బ్రాండ్ బాబు, బందిపోటు, అమీ తుమీ, సుబ్రహ్మణ్యపురం, అ!, రాగల 24 గంటల్లో, మామా మశ్చీంద్ర వంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించింది. అయినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్టార్ హీరోల సరసన భారీ అవకాశాలు మాత్రం ఇంకా రావడం లేదనే చెప్పాలి.
ఇటీవల ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈషా రెబ్బా, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటోంది. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
ఈషా మాట్లాడుతూ..
“ఒక సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను మోసం చేశారు” అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ సినిమా మరేదీ కాదు – ‘అరవింద సమేత వీర రాఘవ’. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, ఈషా రెబ్బా ఆమె చెల్లి పాత్రలో కనిపించింది.
ఈ పాత్రపై స్పందించిన ఈషా,
“అరవింద సమేత కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. అందులో నాకు లీడ్ రోల్ ఉంటుందని చెప్పారు. కానీ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ కాకుండా ఇతర పాత్రలు చేస్తే, ఆడియన్స్ నన్ను అదే కోణంలో చూడవచ్చనే భయం ఉండేది. అయినప్పటికీ, పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రాజెక్ట్ కావడంతో ఒప్పుకున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది కాల్ చేసి – ఈ సినిమా ఎందుకు చేశావ్? ఆ పాత్రలో ఏముంది? అని అడిగారు. అప్పుడు చాలా బాధపడ్డాను” అని చెప్పుకొచ్చింది.
తనకు పాత్ర ప్రాధాన్యత ముఖ్యమని, కానీ అటువంటి రోల్స్ చేస్తూ పోతే హీరోయిన్గా తన ఇమేజ్ దెబ్బతింటుందనే ఆందోళన ఉందని కూడా ఈషా వెల్లడించింది. మొత్తానికి మంచి పాత్ర అని చెప్పి, చివరికి తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వడం వల్ల తాను మోసపోయినట్లు భావించానని, ఇన్‌డైరెక్ట్‌గా త్రివిక్రమ్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసింది..









