Search
Close this search box.

  ఫేక్ కలెక్షన్లకు మా సినిమా దూరం: వంద కోట్లు దాటితేనే పోస్టర్ వేస్తామన్న శర్వానంద్!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన ఐదు ప్రధాన చిత్రాల్లో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. అయితే, ఇతర పెద్ద సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే వందల కోట్ల కలెక్షన్ పోస్టర్లతో హడావుడి చేస్తుంటే, శర్వానంద్ టీమ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వసూళ్ల అంకెలను ప్రకటించలేదు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, హీరో శర్వానంద్ మరియు నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకమని, కేవలం నిజాయితీగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసినప్పుడే ఆ పోస్టర్‌ను గర్వంగా వేస్తామని వారు స్పష్టం చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి చిత్రాల వసూళ్లపై పెద్ద ఎత్తున ‘ఫేక్ కలెక్షన్ల’ వివాదం నడుస్తోంది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ 238 కోట్లు, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ 292 కోట్లు వసూలు చేసినట్లు పోస్టర్లు రిలీజ్ కాగా, వీటిలోని అంకెలు వాస్తవ దూరంగా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ స్పందిస్తూ.. “నా సినిమాలకు ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కలెక్షన్ పోస్టర్లు వేయలేదు. సినిమా ఏంటో మనకు తెలుసు, జనాలకూ తెలుసు. అప్పట్లో ‘శతమానం భవతి’ వంద కోట్లు దాటినా పోస్టర్ వేయలేదు” అని గుర్తు చేశారు. నిజాయితీ లేని నంబర్లతో ప్రచారం చేసుకోవడం కంటే ప్రేక్షకులే తమ సినిమాను ప్రమోట్ చేయడం తమకు సంతృప్తినిస్తోందని ఆయన అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. హాలిడేస్ ముగిసిన తర్వాత కూడా సోమవారం నాటి షోలకు 70-80 శాతం అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటమే సినిమా విజయానికి నిదర్శనమని తెలిపారు. సంక్రాంతికి వచ్చిన ఇతర సినిమాల బుకింగ్స్ వీక్ డేస్‌లో తగ్గుముఖం పట్టినా, ‘నారీ నారీ నడుమ మురారి’ మాత్రం స్టడీగా ఉందని ఆయన వివరించారు. ఈ సంక్రాంతికి జెన్యూన్ హిట్‌గా నిలిచిన తమ సినిమాకు సంబంధించి ఫేక్ ప్రచారాల జోలికి వెళ్ళకుండా, ప్రజల నుంచి వస్తున్న మద్దతుతోనే సినిమా విన్నర్‌గా నిలిచిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు