సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 12 ఏళ్లు గడుస్తున్నా, తెలుగు అమ్మాయి కావడంతో సరైన గుర్తింపు కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నానని నటి ఈషా రెబ్బా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన స్కిన్ కలర్ (చర్మపు రంగు) వల్ల ఎదురైన అవమానాలను గుర్తు చేసుకున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ తన ఫొటో షూట్ సమయంలో శరీరాన్ని జూమ్ చేసి చూస్తూ, “నీ మోచేతులు నల్లగా ఉన్నాయి.. నువ్వు ఇంకా తెల్లగా ఉండాలి” అని వ్యాఖ్యానించడం తనను ఎంతగానో కుంగదీసిందని, ఆ మాటలకు ఎంతో ఏడ్చానని ఆమె ఎమోషనల్ అయ్యారు.
కుటుంబ నేపథ్యం లేని లేదా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను ఇండస్ట్రీలో సులభంగా టార్గెట్ చేస్తారని ఈషా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లి మరణించిన 12వ రోజే బాధ్యతల రీత్యా షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో తనకు ఎదురైన పరిస్థితులు అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చే వారికి, ముఖ్యంగా అండలేని వారికి ఇక్కడ రక్షణ తక్కువగా ఉంటుందనే అర్థం వచ్చేలా ఆమె తన మనోవేదనను పంచుకున్నారు.
అంతేకాకుండా, అవకాశాల కోసం పార్టీలకు వెళ్లాలని, తెలుగు అమ్మాయిలా రిజర్వ్‌డ్‌గా ఉండకూడదని కొందరు తనకు సలహాలు ఇచ్చేవారని ఈషా వెల్లడించారు. టాలెంట్ కంటే ఇలాంటి బాహ్య అంశాలకే ప్రాధాన్యత ఇచ్చే ధోరణి తనను విస్మయానికి గురిచేసిందని చెప్పారు. అచ్చ తెలుగు హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తనకు ఎదురైన ఈ అనుభవాలు ఇండస్ట్రీలోని చీకటి కోణాలను మరోసారి చర్చకు దారితీశాయి.









