యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ జంటగా నటించిన ‘హక్’ (Haqq) చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమా చూసిన నటి సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత భావోద్వేగమైన సందేశాన్ని పంచుకున్నారు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, సినిమా పూర్తయిన తర్వాత తనలో కలిగిన భావాలను మాటల్లో చెప్పలేనని ఆమె పేర్కొన్నారు. మానవీయ కోణంలో సాగే ఇలాంటి సహజమైన చిత్రాలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తాయని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా యామీ గౌతమ్ నటనపై సమంత ప్రశంసలు కురిపించారు. “యామీ.. నీ నటన నన్ను మాటల్లో చెప్పలేనంతగా కదిలించింది. ఒకేసారి ప్రేమ, ఆగ్రహం, బలం, నిస్సహాయత వంటి విభిన్న భావోద్వేగాలను పండించడంలో నువ్వు విజయం సాధించావు” అని కొనియాడారు. చాలా ఏళ్ల తర్వాత ఒక నటన తనను ఇంతలా కదిలించిందని, క్లైమాక్స్‌లో యామీ పలికించిన హావభావాలు, ఆమె మౌనం నటన నేర్చుకునే వారికి ఒక పాఠంలా ఉంటాయని సమంత సెల్యూట్ చేశారు.
కష్టపడి ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామో చెప్పడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనమని సమంత ఉద్వేగానికి లోనయ్యారు. యామీ గౌతమ్ నటనను వర్ణించడానికి పదాలు సరిపోవని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తోటి నటి ప్రతిభను గుర్తిస్తూ సమంత ఇంతలా ప్రశంసించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









