కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం వద్ద తలపెట్టిన డ్రాగన్ పడవల పోటీలతో సంక్రాంతి సందడి వాతావరణం నెలకొంది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులతో డ్రాగన్ పడవల పోటీలు అద్భుతంగా సాగాయి.ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ,కేరళ, మహారాష్ట్రలకు చెందిన జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయని కార్యక్రమానికి ముఖ్యతిధిగా వచ్చిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తాడిపూడి వంతెన వరకు 1000మీటర్ల దూరం సాగిన ఈ పడవల పోటీల్లో టైం ఆధారంగా విజేతలను నిర్ణయించారు. ఈ పోటీల్లో మొత్తం 22 జట్లు పోటీ పడగా 6 జట్లు సెమీఫైనల్స్ కు ఎంపికయ్యాయి. కేరళ (అలెప్పీ), బండారు, కోనసీమ, పల్నాడు -1, కర్నూలు, ఎర్ర కాలువ జట్లు సెమీఫైనల్స్ లో పోటీపడనున్నాయి. అలాగే గాలిపటాల పోటీ లు కూడా ఏర్పాటు చేశారు. లొల్ల లాకుల వద్ద ఏర్పాటుచేసిన ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్లను అనపర్తి తెదేపా పరిశీలకులు ఆకుల రామకృష్ణునితో కలిసి ఎమ్మెల్యే సత్యానందరావు పరిశీలించారు. లొల్ల లాకుల వద్ద ఏర్పాటుచేసిన ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది.









