తమిళ సూపర్‌స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నా, సెన్సార్ బోర్డు (CBFC) ఇంకా సర్టిఫికెట్ జారీ చేయకపోవడం కోలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ జాప్యాన్ని నిరసిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు ఉద్దేశపూర్వకంగానే సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తోందని, దీనివల్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిర్మాతలు కోర్టుకు విన్నవించారు.
మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. సెన్సార్ బోర్డును వివరణ కోరింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, దీనిని రివైజింగ్ కమిటీకి పంపినట్లు బోర్డు తరఫు న్యాయవాదులు తెలిపారు. అయితే, ఇప్పటికే 25 దేశాల్లో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు భారత్‌లో జాప్యం చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చని విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. “విడుదల తేదీని జనవరి 10కి మార్చుకోలేరా?” అని ప్రశ్నించారు, అయితే ఇది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ అని నిర్మాతలు పేర్కొన్నారు.
ఈ వివాదం కారణంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. కర్ణాటక, కేరళ మరియు ఓవర్సీస్ మార్కెట్లలో ఇప్పటికే బుకింగ్స్ ఊపందుకోగా, కేవలం సర్టిఫికెట్ రాకపోవడం వల్లే స్థానిక థియేటర్ల యజమానులు టికెట్ అమ్మకాలను నిలిపివేశారు. హైకోర్టు బుధవారం (జనవరి 7) ఇచ్చే తీర్పుపైనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తేనే ‘జన నాయగన్’ అనుకున్న సమయానికి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.









