టాలీవుడ్ సహాయ నటి వాహిని (పద్మక్క) ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ స్టేజ్ రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కీమోథెరపీ, ఆపరేషన్లు, నిరంతర వైద్య సంరక్షణ కోసం రూ.25–35 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని బయటకు తీసుకొచ్చిన నటి కరాటే కళ్యాణి, వాహినికి అత్యవసరంగా ఆర్థిక సహాయం చేయాలని ప్రజలను వేడుకున్నారు. చిన్న సహాయం కూడా ఆమె ప్రాణ రక్షణకు కీలకమని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
టాలీవుడ్‌లో సహాయ నటిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన వాహిని అలియాస్ పద్మక్క సినిమాలు, సీరియల్స్‌లో తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1978లో జన్మించిన వాహిని టీవీ, సినిమా రంగాల్లో ‘జయ వాహిని’ పేరుతో ప్రసిద్ధి చెందారు. చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాలు, సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో కంటే టీవీ సీరియల్స్‌లో ఆమె ప్రయాణం సాఫీగా సాగిందని చెప్పాలి. జెమిని, ఈటీవీల్లో ప్రసారమైన అనేక సీరియల్స్‌లో ఆమె నటించారు. గతేడాది వచ్చిన ‘బహిర్భూమి’ అనే సినిమాలోనూ ఆమె కనిపించారు.
బహుముఖ నటిగా పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించిన వాహిని ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వార్త బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. గత కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్ (Breast Cancer)తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారి బహుళ అవయవాల పనితీరులో లోపాలు కనిపించడంతో ఆమెను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు నిరంతర చికిత్స, కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూ కేర్ కోసం ₹25 లక్షల నుంచి ₹35 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది.









