నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని కలిగి ఉన్న బండి సరోజ్ కుమార్, తాజాగా సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘మోగ్లీ’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఇష్టంతో ఈ వైపుకు వచ్చానని, మొదట్లో ఎవరో ఒకరు తనను హీరో చేస్తారని అనుకునేవాడినని తెలిపారు. అయితే, మార్కెట్ ఉన్న హీరోలతో సినిమాలు చేయాలనే ఆలోచన వర్కౌట్ కాకపోవడంతో తానే హీరోగా మారానని, అప్పటి నుంచే తన సక్సెస్ స్టార్ట్ అయిందని బండి సరోజ్ కుమార్ వివరించారు.
బండి సరోజ్ కుమార్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. “నా పర్సనల్ విషయాలను గురించి నేను మాట్లాడదలచుకోలేదు. నాకు మా పేరెంట్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. వాళ్లను గురించి నేను ఆలోచన చేయను. నా గురించి వాళ్లు ఆలోచిస్తారని నేను అనుకోను,” అని స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచే తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని, ‘నేనేంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడమేంటి? రిచ్ ఫ్యామిలీలో కదా పుట్టాలి?’ అని అనుకునేవాడినని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సినిమా తప్ప తనకు మరేదానిపైనా వ్యామోహం ఉండదని బండి సరోజ్ కుమార్ పేర్కొన్నారు. సినిమాతో తప్ప తాను ఎవరితోనూ టచ్‌లో ఉండనని, తన జీవితమంతా సినిమా చుట్టే తిరుగుతుందని వివరించారు. తన ప్రత్యేకమైన ఆలోచనలు, కథల ఎంపిక ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. త్వరలో విడుదల కానున్న ‘మోగ్లీ’ సినిమాలో బండి సరోజ్ కుమార్ నటన ఎలా ఉండబోతుందోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








