జియో హాట్‌స్టార్ మంగళవారం చెన్నైలో నిర్వహించిన ‘సౌత్ అన్‌బాండ్’ ఈవెంట్ సినీ ప్రముఖులతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కమల్ హాసన్, మోహన్ లాల్, అక్కినేని నాగార్జున, విజయ్ సేతుపతి వంటి దక్షిణాది అగ్ర హీరోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీ సంస్థ తమ ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. ఈ వేదికపై విజయ్ సేతుపతి, కింగ్ నాగార్జునపై చేసిన సరదా వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
విజయ్ సేతుపతి నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయనకు వయసు పెరగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “నాగార్జున గారు జెంటిల్‌మ్యాన్. నా చిన్నప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. యాంటీ ఏజింగ్‌పై రీసెర్చ్ చేసేవారు ఉంటే, ఈయన్ని తీసుకెళ్లి కొన్ని రోజులు పరీక్షించాలి,” అని సరదాగా అన్నారు. అంతేకాకుండా, ఆయన జుట్టు, లుక్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మారలేదని, తన మనవళ్లు పెద్దవారైనా నాగార్జున మాత్రం అలాగే ఉంటారని పేర్కొంటూ ఆయన హ్యాండ్‌సమ్‌నెస్, ఎనర్జీని మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ హోస్టింగ్ అనుభవాలను నాగార్జున, విజయ్ సేతుపతి పంచుకున్నారు. బిగ్ బాస్ తెలుగుకు నాగార్జున, తమిళ బిగ్ బాస్ సీజన్ 8కి విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో హోస్ట్ చేయనని చెప్పినా, ఆ తర్వాత అది వ్యసనంగా మారిపోయిందని నాగార్జున తెలిపారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ, ఇలాంటి రియాలిటీ షోకి వ్యాఖ్యతగా ఉండడం చాలా సులభమని, ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకొనే అవకాశం ఈ షో ద్వారా వచ్చిందని చెప్పారు. తాను కూడా మొదట్లో హోస్ట్ చేయలేనని చెప్పినా, హోస్ట్ చేసిన తర్వాత దాని నుంచి చాలా నేర్చుకున్నానని, ఇది డ్రామా కాదని, అంతా నిజమే అని ధృవీకరించారు.








