సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12) సందర్భంగా ఆయన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పడయప్పా’ (తెలుగులో ‘నరసింహ’) ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కాబోతోంది. ఈసారి 4K డిజిటల్ ప్రింట్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో విడుదలవుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఈ సినిమా సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నరసింహ’కు సీక్వెల్ తీసే అవకాశం ఉందని రజనీకాంత్ వెల్లడించారు. అయితే, ఆ సీక్వెల్ కథ తన పాత్ర కంటే ఎక్కువగా రమ్యకృష్ణ పోషించిన ఐకానిక్ విలన్ పాత్ర ‘నీలాంబరి’ చుట్టూనే కేంద్రీకృతమై ఉంటుందని ఆయన చెప్పడం పెద్ద సంచలనంగా మారింది. రమ్యకృష్ణ అద్భుతమైన నటన, హావభావాలతో నీలాంబరి పాత్ర తెలుగు-తమిళ సినీ చరిత్రలో నిలిచిపోయింది.
మొదటి భాగంలో నీలాంబరి పాత్ర చనిపోతుంది కాబట్టి, సీక్వెల్‌లో ఆ పాత్ర ఎలా తిరిగి వస్తుందనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇది ఫ్లాష్‌బ్యాక్ ఆధారిత కథనా లేక కొత్త కోణంలో కథను మలుస్తారా అనే విషయంపై అభిమానుల్లో, ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఏదేమైనా, రజనీకాంత్ ఈ ప్రకటన చేయడం ‘నరసింహ’ సీక్వెల్‌పై అంచనాలను భారీగా పెంచింది.








