తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె చేరువయ్యారు. సినిమాలకు కొద్దికాలం దూరంగా ఉన్న ఆమె, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తుందని అంతా భావించారు.
ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్‌కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో నివేదా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలలకే తాజాగా నివేదా మరియు రాజ్ హిత్ ఇబ్రాన్ ఇద్దరూ తమతమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించారు.
ఫొటోలు డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనీ, పెళ్లి రద్దయిందనీ నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. నివేదా వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారినప్పటికీ, ఈ ఊహాగానాలపై నటి నివేదా పేతురాజ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.








