తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుహృద్భావ సంబంధాలు కలిగి ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిలకలూరిపేట శారదా జెడ్పీ హైస్కూల్‌లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో భాగంగా పవన్ విద్యార్థులు, పేరేంట్స్‌నుద్దేశించి ప్రసంగించారు. గురువులు ఒక దెబ్బ వేసినంత మాత్రన తల్లిదండ్రులు సీరియస్‌గా స్పందిచాల్సిన అవసరం లేదన్నారు. క్రమశిక్షణ అలవాడలంటే అది పాఠశాల స్థాయి నుండే జరగాలన్నారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలంలో జరిగిన ఓ చిన్న సంఘటనలో పిల్లలను దానిలోకి లాగి, రాజకీయ రంగు పులమాలని అనుకున్నారని పవన్ గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

‘‘నేటి రోజుల్లో విభిన్న సృజన అనేది ప్రతి విద్యార్థికి అవసరం. గురువులు కూడా కేవలం విద్యార్థులను జీతగాళ్లుగా తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, దేశానికి పనికొచ్చేలా తీర్చిదిద్దాలి. పిల్లల్లోని సృజనను గుర్తించి వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలి. కేరళ తరహాలో విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతరం సమన్వయం చేసుకునేలా ముందుకు సాగాలి. అని పవన్ చెప్పుకొచ్చారు.

లోకేష్ నిర్ణయాలు భేష్
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు మీద అందరికీ అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థి బలాలు, బలహీనతలు తెలుస్తాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి.. ఎలా అధిగమించాలో ఇటు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలుస్తుంది. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. గురువును దైవంగా భావించే సంస్కృతి మనది. గురువులు కేవలం పాఠాలే కాదు జీవితాలు చెబుతారు. వారి మార్గదర్శకంలో మనం ఎంతో ఎదుగుతాం. నాకు చిన్నప్పుడు సోషల్ టీచర్ చెప్పిన దేశభక్తి పాఠాలు, గొప్ప నాయకుల చరిత్రలు నన్ను ఎంతో ఆలోచింపజేశాయి. ఈనాడు మీ ముందు ఇలా ఉన్నానంటే గురువులు చెప్పిన పాఠాలే ప్రధాన కారణం. అని పవన్ చెప్పుకొచ్చారు.

చరిత్రలో నిలిచిపోవాలి
ఐఏఎస్ కృష్ణతేజ తాత గారైన మైలవరపు గుండయ్య వందల ఎకరాల భూమిని ప్రజాహితం కోసం దానం చేశారని పవన్ గుర్తు చేశారు. మైలవరపు గుండయ్య పేరు మీద ఒక చౌక్ ఉందీ అంటే ఎంత దానశీలి అనేది తెలుస్తుందన్నారు. ఇక్కడి స్కూల్ కి తోట చంద్రయ్య అనే వారు స్థలం దానం చేశారని అధికారులు పవన్‌కు ఈసందర్భంగా వివరించారు. విద్యార్థులకు, మనకు అలాంటి పెద్దల దీవెనలు ఉండాలి. అయితే నేటి రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. ఉన్న స్థలాలను దోచుకుపోయేవారు ఎక్కువయ్యారని పవన్ అన్నారు.

ఇటీవల తాను మైసూరవారిపల్లె వెళ్లినపుడు అక్కడున్న పాఠశాలకు ఆట స్థలం లేదు అని తెలిసి, స్వయంగా కొనుగోలు చేసి ఇచ్చినట్లు పవన్ తెలిపారు. చిలకలూరిపేట శారదా హైస్కూల్‌లో విద్యార్థుల సౌకర్యార్ధం లైబ్రేరీ నిండా పుస్తకాలు, 25 కంప్యూటర్లను అందిస్తానని పవన్ హామీ ఇచ్చారు.










