యువత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ అని డిసిసిబి చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో ఉన్న బాదం మాధవరం బాలికల పాఠశాలలో తదేకం ఫౌండేషన్ సహకారంతో, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్ల లక్ష్మి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ టెస్ట్ బుక్స్‌ని అందించారు. కార్యక్రమానికి తుమ్మలబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి యువత ఉన్నత చదువు చదువుకుని తమ తల్లిదండ్రులకు చదివిన స్కూల్ కి పేరు వచ్చే విధంగా నడుచుకోవాలన్నారు. తద్వారా విద్యార్థులు పుట్టిన ఊరికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయన్నారు. యువత ఉత్సాహంగా ఉంటూ విద్యారంగంలో క్రీడారంగంలో రాణించే విధంగా ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓదూరి కిషోర్, ఎస్సీ కార్పోరేషన్ డైరక్టర్ దానం లాజర్‌బాబు, సూరవరపు సురేష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.









