డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంనియోజకవర్గంలో రాజకీయం రోజుకో రూపుమారుతోంది. ఇప్పటి వరకూ జనసేన ఇన్‌ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్‌ను ఆ పదవి నుండి తప్పించారు. గ్రూపు రాజకీయాలకు బ్రేక్ పెట్టడానికే జనసేనాని సీరియస్ యాక్షన్‌లో దిగినట్టు తెలుస్తోంది. గత కొంత కాలం కిందట పవన్ నియమించిన ఐదుగురు కమిటీ సభ్యులలో ఒకరైన జనసేన ఇన్‌ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ను పక్కకు తప్పించి, ఆయన స్థానంలో ఓదూరి కిషోర్ అనే యువకుడికి అవకాశం కల్పించారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు ఓకింత అలజడిరేపుతున్నాయి. తాజాగా పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌పై పవన్ ఓకింత ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఆయనను ఇన్‌ఛార్జి పదవి తోపాటు, ఐదుగురు సభ్యుల కమిటీ నుండి తప్పించడం తీవ్ర కలకలరం రేపింది. అయితే గత కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అక్కడే మర్రెడ్డిపై తీవ్ర స్థాయిలో పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేదని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో ఐదుగురు సభ్యుల కమిటీని పవన్ ఏర్పాటు చేశారు. అందులో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మలబాబు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతోపాటు, పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జి గా ఉన్న మర్రెడ్డి కూడా ఉంటారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయనను తప్పించారని జనసేన నేతలే బాహాటంగా చెప్పడం, కమిటీ నుండి, ఇన్‌ఛార్జి పదవి నుండి తప్పించలేదని ఖండన లేకపోవడంతో దాదాపు మర్రెడ్డిని పక్కన పెట్టేసారనేది తేలిపోయింది. ఆయన స్థానంలో ఐదుగురు సభ్యుల కమిటీలో చేబ్రోలులో పవన్ కళ్యాణ్ కార్యాలయం యజమాని ఓదూరి నాగేశ్వరరావు కుమారుడు ఓదూరి కిషోర్‌కు అవకాశం లభించిందని ప్రచారం జరుగుతోంది.

*మర్రెడ్డి ఒంటెద్దు పోకడలే కారణమా..?*
జనసేన పిఠాపురం ఇన్‌ఛార్జిగా ప్రకటించిన తర్వాత మర్రెడ్డి శ్రీనివాస్ క్యాడర్‌తో సత్ససంబంధాలు నిలుపుకోలేకపోయారనేది ప్రధాన అంశంగా ఉండిపోయింది. దీంతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అంటే గిట్టని కొంత మంది నేతలతో అంటకాగడం అధినేత ఆగ్రహానికి గురిచేసిందని అంటున్నారు. దీంతోపాటు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనూయలన వ్యతిరేఖించడం, ఎంపీ పాల్గొనే కార్యక్రమాలకు దూరం కావడం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తుమ్మలబాబుతోనూ వ్యతిరేఖించడం వంటి పలు ఆరోపణలు మర్రెడ్డిపై ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగుల బదిలీలు, సిండికేట్, ఇతర అంశాలలో మర్రెడ్డి అంతర్గతంగా వ్యవహారం నడిపారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇటీవల కాకినాడలో జనసేన నేతలు ఎవ్వరూ పాల్గొనని ఓ నేత ఇచ్చిన విందుకు హాజరుకావడం కూడా మర్రెడ్డికి లేనిపోని చిక్కులను తెచ్చిపెట్టిందని అంటున్నారు. మొత్తంగా మర్రెడ్డిని తప్పిస్తేనే వ్యవహారం చక్కబడుతుందన్న ఆలోచనకు అధినేత రావడంతో ఆయనను తప్పించారని జనసేన నేతలే బాహాటంగా చెప్పడం పిఠాపురం జనసేన రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఎవ్వరికి అంతుచిక్కడం లేదు.









