సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ‘Thalaivar 173’ నుంచి దర్శకుడు సుందర్ సి (Sundar C) తప్పుకున్నారు. ఈ అరుదైన కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్ సి తప్పుకుంటున్నట్లు స్వయంగా ఒక లేఖ ద్వారా ప్రకటించడం సినీ ప్రియులకు షాక్‌నిచ్చింది.
“అనుకోని పరిస్థితుల వల్ల Thalaivar 173 నుండి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం చాలా భారమైనది,” అని సుందర్ సి తన లేఖలో పేర్కొన్నారు. రజనీకాంత్ లాంటి లెజెండరీ సూపర్‌స్టార్‌తో, కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా చేయడం తన కల నెరవేరినట్టేనని ఆయన అన్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలతో గడిపిన కొద్ది రోజుల ప్రత్యేక క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని, వారి నుంచి నేర్చుకున్న పాఠాలు అమూల్యం అని సుందర్ సి పేర్కొన్నారు.
ఈ అప్‌డేట్‌తో అభిమానులు నిరాశ చెందితే హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నానని సుందర్ సి తెలిపారు. తాను ఈ అవకాశాన్ని కోల్పోతున్నా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ప్రేక్షకులకు మంచి వినోదం అందించడానికి కట్టుబడి ఉంటానని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సుందర్ సి స్థానంలో కొత్త దర్శకుడు ఎవరు వస్తారనే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.









