ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న తన రాబోయే సినిమాకు సంబంధించిన ‘గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ గురించి కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న “ఎవరైనా వెళ్లొచ్చు” అనే వార్తలను నమ్మొద్దని, పాసులు ఉన్నవారిని మాత్రమే ఈవెంట్‌కు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. అభిమానులందరూ క్రమశిక్షణగా వ్యవహరించాలని, పాసులు లేనివారు ఈ కార్యక్రమాన్ని జియో హాట్‌స్టార్‌లో లైవ్‌గా వీక్షించవచ్చని విజ్ఞప్తి చేశారు.
ఈవెంట్ వేదిక వద్దకు చేరుకునే మార్గాల గురించి కూడా రాజమౌళి వివరాలు అందించారు. పాసులపై ఉన్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా, వేర్వేరు ప్రాంతాల నుంచి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో వీడియోల రూపంలో స్పష్టమైన సూచనలు పొందవచ్చని తెలిపారు. ఈవెంట్ ప్రాంగణం వద్ద భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, 18 ఏళ్లలోపు పిల్లలకు, వృద్ధులకు ఈవెంట్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు రాజమౌళి పేర్కొన్నారు. కాబట్టి వారు ఇళ్ల వద్ద నుంచే లైవ్ స్ట్రీమింగ్‌లో కార్యక్రమాన్ని చూడాలని ఆయన కోరారు.
ఎల్లుండి జరగనున్న ఈ ‘గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద లైవ్ ఫ్యాన్ ఈవెంట్‌లలో ఒకటిగా నిలవనుంది. దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు ఒకేచోట హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్, స్క్రీన్ (100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పు) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నటులు పృథ్విరాజ్ సుకుమారన్ మరియు ప్రియాంక చోప్రా జోనస్ (‘మందాకిని’ లుక్) ఫస్ట్ లుక్స్ విడుదలై సంచలనం సృష్టించాయి.









