టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరో వడ్డే నవీన్. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ గారి కుమారుడైన ఈయన, 1997లో ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, అదే ఏడాది విడుదలైన కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘పెళ్లి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా, ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ‘ప్రియా ఓ ప్రియా’, ‘స్నేహితులు’, ‘చాలా బాగుంది’, ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’ వంటి పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో వడ్డే నవీన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
వడ్డే నవీన్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, తెలుగులో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న ఇద్దరు స్టార్ హీరోలు ఆయనకు బావమరుదులు అవుతారు. వారు మరెవరో కాదు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్. వడ్డే నవీన్ మొదటగా నందమూరి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, నందమూరి రామకృష్ణ గారి కూతురు చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు. ఈ చాముండేశ్వరి గారే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు అక్క వరుస అవుతారు. అయితే, కొన్నేళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వడ్డే నవీన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
దాదాపు 28 సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్, హీరోగా అవకాశాలు తగ్గాక కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటించారు. అయితే, గత పదేళ్లుగా ఆయన సిల్వర్ స్క్రీన్ పైన కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రియల్ ఎస్టేట్‌లో స్థిరపడినట్లు సమాచారం. ఆ మధ్య ఒక ఫంక్షన్‌లో కనిపించిన నవీన్ కాస్త బొద్దుగా మారారు. ఒకప్పటి ఫ్యామిలీ హీరోగా వడ్డే నవీన్, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.









