“రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్దం చేసుకున్నాం… అన్ని రంగాల్లోనూ సీమను అభివృద్ధి చేసేలా మా దగ్గర ప్రణాళికలున్నాయి. దీంట్లో భాగంగానే రాయలసీమకు హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కుప్పం చిట్ట చివరి భూములకు నీటిని అందించాం. రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీకి జీర్ణం కాదు. వైసీపీకి నాటకాలు ఆడడం అలవాటు… ఎన్డీఏకు నీళ్లు తేవడం అలవాటు.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహరతి ఇచ్చారు. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కృష్ణా జాలాలు కుప్పం చివరి భూములకు చేరాయి. శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పానికి చేరుకుంది.
ఈ సందర్భంగా పరమసముద్రంచెరువు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘నన్ను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన నా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావడంతో నా జన్మ ధన్యమైంది. కృష్ణా పుష్కరాలు 2028లో వస్తుంటే కుప్పానికి మాత్రం రెండేళ్లు ముందే వచ్చాయి. కుప్పం ప్రజలు నన్ను ఇంటి బిడ్డగా ఆదరించారు. వారికి నేను ఏం చేసినా తక్కువే’ అని చంద్రబాబు అన్నారు.
రాక్షసుల్లా అడ్డు పడుతున్నారు
“రాష్ట్రాభివృద్ధికి యజ్ఞం చేస్తుంటే… కొందరు రాక్షసుల్లా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రతి మంచి పనికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైసీపీ విషవృక్షంలా తయారైంది. రప్పా రప్పా రాజకీయం చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో రప్పా రప్పా రాజకీయం ఎలా ఉంటుందో… ప్రజలే వారికి చూపించారు.” అని ముఖ్యమంత్రి అన్నారు.
ఆటో డ్రైవర్లకూ అండగా ఉంటాం
“ఉచిత బస్సు ప్రయాణంతో ఆడబిడ్డలంతా సంతోషంగా ఉన్నారు. స్త్రీ శక్తితో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా చూస్తాం. వారిని కూడా ఆదుకుంటాం. ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూర్మెంట్ చేపడుతున్నాం. కుప్పం నుంచి కూడా 50 మంది టీచర్లు ఎంపికయ్యారని చంద్రబాబు అన్నారు. కుప్పానికి 12 పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు వివరించారు. కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలతో 6 ఎంఓయూలు చేసుకున్నారు.