విభిన్న ప్రతిభావంతుల వినతులను, వారు తెలియచేసిన సమస్యలను మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామన్నారు. విశాఖపట్నంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 2ను సవరించి రోస్టర్ పాయింట్ 6ని జనరల్ చేయాలనీ, దీని వల్ల అర్హులైన అంధ పురుష అభ్యర్ధులకు కూడా మేలు జరుగుతుందనీ, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభిన్న ప్రతిభావంతులకు వ్యక్తిగత రేషన్ కార్డులు మంజూరు చేయాలని, దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని
విన్నవించారు. ఈ సందర్భంగా తమకు ఇస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీలో తలెత్తుతున్న ఇబ్బందులను తెలిపారు. దివ్యాంగుల సమస్యలు ఓపికగా విన్న పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఆటో డ్రైవర్ల సమస్యలు
విశాఖపట్నంకి చెందిన పలువురు ఆటో డ్రైవర్లు తమ సమస్యల్ని తెలియచేస్తూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతి పత్రం అందించారు. స్త్రీ శక్తి పథకం వల్ల తమ ఆదాయం తగ్గిందని వాపోయారు. ఆ వినతి పత్రం పరిశీలించిన పవన్ , స్త్రీ శక్తి పథకం సూపర్ సిక్స్ హామీల్లో భాగమని, ఈ పథకం ద్వారా మహిళలకి ఆర్థికపరమైన వెసులుబాటు ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఆటో డ్రైవర్లు ఆదాయ మార్గాల పెంపు అంశం, వారు తెలిపిన ఇతర సమస్యల్ని మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు