‘కొత్త బంగారు లోకం’తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల, రెండో సినిమాగా తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మంచి క్రేజ్ సంపాదించారు. తర్వాత వచ్చిన ముకుంద కూడా మంచి పేరు తెచ్చింది. అయితే మహేశ్‌బాబు హీరోగా చేసిన బ్రహ్మోత్సవం ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొనడంతో అడ్డాల కెరీర్ కాస్త కష్టాల్లో పడింది. ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన నారప్ప సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో పెద్దగా హైప్ రాలేదు. ఇటీవల చేసిన పెదకాపు కూడా ఆశించిన స్థాయిలో నడవలేదు. దీంతో ఇక ఆయనకు హీరోలు అవకాశమిస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి.
అయితే తాజాగా అడ్డాలకు మరో ఛాన్స్ లభించబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. కిరణ్ అబ్బవరంతో ఆయన సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి, ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవుతున్నదట. ఈ ప్రాజెక్ట్‌ను రానా దగ్గుబాటి నిర్మించనున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే – రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణమండపంతో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నా, తరువాత పెద్ద విజయాలు అందుకోలేకపోయాడు. అయితే క మంచి సక్సెస్ ఇవ్వగా, ఈ ఏడాది వచ్చిన దిల్ రూబా మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం కె-ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్, ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..