ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ గురించి హంగామా రోజురోజుకూ పెరుగుతోంది. భారీ బడ్జెట్‌తో పాటు క్యాస్టింగ్ విషయంలోనూ ఈ ప్రాజెక్ట్ సినిమాప్రియుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇప్పటికే దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న పేర్లు లిస్ట్‌లో ఉండగా, భాగ్యశ్రీ బోర్సే కూడా జాయిన్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది..తాజాగా ఈ AA22లోకి మరో క్రేజీ యాడిషన్ జరగనుందట. అదే రమ్యకృష్ణ. ఒక ప్రధానమైన, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్ కోసం అట్లీ ఆమెను ఒప్పించాడని సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది…ఇప్పటివరకు అల్లు అర్జున్ సినిమాల్లో రమ్యకృష్ణ ఎప్పుడూ కనిపించకపోవడంతో, ఈ కాంబినేషన్ మొదటిసారి సెట్ అవుతుండటం స్పెషల్‌గా మారింది. బాహుబలి తర్వాత స్క్రిప్ట్‌లను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్న రమ్యకృష్ణకు, ఈ పాత్రలోని డెప్త్ ఒక్క సిట్టింగ్‌లోనే నచ్చిపోయిందని సినీ వర్గాల్లో చర్చ. బన్నీ తల్లిగా కనిపించవచ్చన్న లీక్‌లు బయటకు వస్తున్నా, కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా లేదు.
ఇక షూటింగ్ విషయానికి వస్తే—ముంబైలో ఒక కీలకమైన షెడ్యూల్ పూర్తి చేశారు. కానీ షూట్ అప్డేట్స్ బయటకు రాకుండా అట్లీ జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటివరకు కేవలం రెండు హీరోయిన్ పేర్లనే అధికారికంగా ప్రకటించగా, మిగిలినవి లీక్స్ ద్వారానే బయటకొచ్చాయి.
2026 రిలీజ్ టార్గెట్‌గా పెట్టుకున్న ఈ చిత్రానికి డేట్ ఇంకా ఖరారు కాలేదు. ముప్పై శాతం షూట్ పూర్తయ్యాకే రిలీజ్ ప్లాన్‌పై నిర్ణయం తీసుకోవాలని అట్లీ, నిర్మాత కళానిధి మారన్ నిర్ణయించుకున్నారట. పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో, ప్రతి విషయంలోనూ అదనపు కేర్ తీసుకుంటున్నాడని టాక్. నాలుగు వేరే షేడ్స్‌లో అల్లు అర్జున్ కనిపించనున్నాడనే వార్తలు ఇప్పటికే క్రేజ్ పెంచేశాయి.
హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ స్పైరో రజాటోస్ లాంటి టాప్ టెక్నీషియన్లు ఈ విజువల్ వండర్ కోసం పని చేస్తున్నారు. బడ్జెట్ ₹400 కోట్లకు పైగా ఉంటుందని చెన్నై టాక్. అంతకంటే ఎక్కువైనా ఆశ్చర్యం లేదట..