దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ యానిమేషన్ చిత్రోత్సవంలో పాల్గొన్న రాజమౌళి, ఈ సినిమా కథపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ… ‘వారణాసి’ కథకు ప్రధాన బలం తండ్రీ–కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ అని తెలిపారు.
అంతేకాదు… ఈ సినిమా విజువల్‌గా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పారు. ఆఫ్రికా అరణ్యాలు, అంటార్కిటికా మంచు ప్రాంతాలు, రామాయణంలోని దివ్య అంశాలు, ప్రకృతి విపత్తులు, ఫాంటసీ అడ్వెంచర్… ఇవన్నీ ఒకే సినిమాలో అద్భుతంగా మిళితమై ఉంటాయని వెల్లడించారు.
ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించనుండగా, ఈ భారీ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
నిర్మాతలు కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా భారీ అంచనాలను పెంచింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథను రూపొందించారు. సంభాషణలను దేవా కట్టా రాస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే… ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా… భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజువల్ స్పెక్టాకిల్‌గా నిలుస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.







