ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు, ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ సాలిడ్ ట్రీట్ ఇచ్చారు. మాస్ విజువల్స్, డార్క్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా కథ స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ కాలం నుంచే మొదలవుతుందని తెలుస్తోంది. బ్రిటిష్ వాళ్లు ఇండియాను కేంద్రంగా చేసుకుని హెరాయిన్ డ్రగ్ వ్యాపారాన్ని నడిపించేవారని, ఆ చీకటి సామ్రాజ్యం చుట్టూనే కథ తిరుగుతుందని సమాచారం. ముఖ్యంగా ఓపియం పాపీ మొక్క నుంచి తయారయ్యే హెరాయిన్ డ్రగ్‌నే ఈ కథలో ప్రధాన అంశంగా చూపించబోతున్నట్లు టాక్. ఆఫ్గనిస్తాన్ నుంచి థాయిలాండ్ – బర్మా వరకు విస్తరించిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ప్రాంతం ఈ కథకు కీలకంగా మారనుంది.
బ్రిటిష్ వాళ్లు ఇండియా విడిచిపెట్టి వెళ్లిపోయాక… ఆ భారీ డ్రగ్ సామ్రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అనేక గ్యాంగ్స్ మధ్య రక్తపాతం మొదలవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా “ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ” మరియు “గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ” మధ్య జరిగే యుద్ధమే సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ అని సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ “లూగర్” అనే అత్యంత క్రూరమైన హంతకుడి పాత్రలో కనిపించబోతున్నాడట. తన వ్యాపారానికి అడ్డుగా వచ్చిన వాళ్లను క్షణాల్లో అంతం చేసే పవర్ఫుల్ క్యారెక్టర్లో తారక్‌ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడని టాక్.
ఇక ఈ హెరాయిన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగే ఇండియా నార్కోటిక్స్ బ్యూరో హెడ్ “రఘువీర్ రాథోడ్” పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్నాడు. లూగర్ను పట్టుకునేందుకు అతను ఆఫ్గానిస్తాన్ వరకు వెళ్లే సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది.
అయితే చివరికి ఈ డ్రగ్ సామ్రాజ్యానికి ముగింపు పడుతుందా? లూగర్ అసలు బ్యాక్‌స్టోరీ ఏంటి? గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.









