‘మిర్జాపూర్’… ఈ పేరు వినగానే గుర్తొచ్చేది రక్తపాతం, పవర్ గేమ్స్, మున్నా భయ్యా డైలాగ్స్. ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ క్రైమ్ డ్రామా ఇప్పుడు వెండితెరపై తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ‘మిర్జాపూర్: ది మూవీ’ పేరుతో ఈ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ థియేటర్లలోకి రాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు విడుదల చేసిన పవర్‌ఫుల్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
థియేటర్ల కోసం భారీ ప్లాన్
రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ టీజర్‌లో మిర్జాపూర్ ప్రపంచాన్ని మరింత భారీ స్థాయిలో చూపించారు. పక్కా కమర్షియల్ టచ్‌తో కట్ చేసిన ఈ గ్లింప్స్‌లో యాక్షన్, ఎమోషన్, పవర్ గేమ్స్ అన్నీ హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా సిరీస్‌లో కనిపించకుండా పోయిన కొన్ని కీలక పాత్రలు మళ్లీ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మున్నా భయ్యా రీ-ఎంట్రీ హైలైట్
భయానక గ్యాంగ్‌స్టర్ కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి మరోసారి తనదైన స్టైల్‌లో ఆకట్టుకోగా, గుడ్డూ భయ్యా పాత్రలో అలీ ఫజల్ మరింత రౌద్రంగా కనిపించాడు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మున్నా భయ్యా రీ-ఎంట్రీ. సిరీస్‌లో చనిపోయాడని భావించిన దివ్యేందు పాత్ర మళ్లీ వెండితెరపై కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. “మిర్జాపూర్ గద్దె నాదే” అంటూ మున్నా భయ్యా చెప్పే డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యాక్షన్‌కు కొత్త లెవెల్
ఈసారి పాత పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్స్ కూడా కథలో కీలకంగా ఉండబోతున్నాయి. రవి కిషన్‌తో పాటు ‘పంచాయత్’ ఫేమ్ జితేంద్ర కుమార్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో కథ మరింత ఆసక్తికరంగా మారనుంది.
టీజర్‌ను బట్టి చూస్తే ఈసారి పోరు కేవలం మిర్జాపూర్ గద్దె కోసం మాత్రమే కాదు… దేశవ్యాప్త ఆధిపత్యం, రాజకీయ వ్యూహాల చుట్టూ తిరిగే భారీ యుద్ధంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్
‘మిర్జాపూర్: ది మూవీ’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటివరకు ఓటీటీలో మొబైల్ స్క్రీన్‌లపై చూసిన మిర్జాపూర్ ప్రపంచాన్ని, ఇప్పుడు డాల్బీ అట్మోస్ సౌండ్‌తో భారీ తెరపై చూడబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈసారి మున్నా భయ్యా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.









