“పెద్ది” కోసం అభిమానుల ఎదురు చూపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతాన్ని ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి”, “రై రై” పాటలు యూట్యూబ్‌లో భారీ హిట్ సాధించి సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుని, ముఖ్యంగా మహిళా అభిమానులను ఫిదా చేసింది.
మొదట ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని భావించిన మేకర్స్, తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. కానీ మరింత క్వాలిటీ కోసం మళ్లీ రిలీజ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, చివరకు జూన్ 4న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. తరచూ వాయిదాలు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు ఫిక్స్ అయిన తేదీతో అభిమానులకు ఊరటనిచ్చింది.
ఇక ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR”తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, తర్వాత ఎస్. శంకర్ తెరకెక్కించిన “గేమ్ ఛేంజర్”తో నిరాశపరిచారు. దీంతో “పెద్ది”పై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. “ఉప్పెన”తో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చరణ్ కెరీర్‌కు కీలకంగా మారింది.
అయితే జూన్ 4 రిలీజ్ అనేది ఒక రిస్క్ కూడా అని చెప్పాలి. ఎందుకంటే జూన్ 12 నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభమవుతాయి. అంటే మొదటి వారం లోపలే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాల్సిన పరిస్థితి. కథ బలంగా ఉంటే తక్కువ రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించడం సాధ్యమే కానీ, లేకపోతే ప్రభావం పడే అవకాశం ఉంది.
మొత్తానికి “పెద్ది”పై అంచనాలు భారీగా ఉన్న ఈ సమయంలో, జూన్ 4న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.









