సంక్రాంతికి వచ్చేస్తోంది. ఇక కోడిపందాలు మొదలవుతున్నాయి. మరోపక్క అధికారులు మాత్రం కోడిపందాలకు ససేమిరా అంటున్నారు. అయితే కాకినాడ జిల్లాలోని పిఠాపురం టిడిపి ఇన్ఛార్జి వర్మ ఖచ్చితంగా కోడిపందాలు కొనసాగుతున్నాయని తెగేసి చెప్పేసారు. అక్కడితో ఆగకుండా నూతన సంవత్సర వేడుకల్లో కోడిపుంజలతో పందెం కూడా పెట్టారు. పిఠాపురం టిడిపి కార్యాలయం లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఏకంగా దగ్గరుండి కోడిపందాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వర్మను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వర్మ కోడి పుంజలను పట్టుకుని పందాలు వేయించారు. ఈసందర్భంగా ఆయన కోడిపందాలు అనేవి ఈనాటివి కావని, తరతరాలుగా సాంప్రదాయబద్దంగా వస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. అయితే కోడిపందాల పేరుతో కత్తులు కట్టుకుని పందాలకు దిగడం నేరమన్నారు. అలాంటి వాటిని తాము ప్రోత్సహించబోమన్నారు.
సాంప్రదాయ క్రీడగానే కోడిపందాలను చూడాలన్నారు.ఈ సంక్రాంతికి కోడిపందాలు యధావిధిగానే ఉంటాయన్నారు. వర్మ కోడి పుంజులను బరిలోకి దింపడంతో టిడిపి కార్యకర్తల్లో ఉత్సాహం రేగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోపక్క జనసేన నాయకులు కోడిపందాలకు సిద్దమతున్నారు. అయితే కూటమిలో కలిసి పందాలు కడతారా..లేక విడి విడిగా పందాలు నిర్వహిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.









