డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆయనకు విమర్శలు పెరుగుతున్నాయి. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో పవన్ తీరుపై వైసీపీ కౌన్సిలర్లు సెటైర్లతో ముంచెత్తారు. డిప్యూటీ సీఎం గారు ఒక్కసారి పిఠాపురం రండి. పిఠాపురం మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేగా మీరు పట్టించుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలైన తర్వాత పిఠాపురాన్ని ఎక్కడికో తీసుకెళ్తానన్న పవన్ పిఠాపురంలో ఏం చేసారంటూ వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. వైసీపీ కౌన్సిలర్లు బొజ్జా జగదీశ్వరి, బోనుదేవ, లలితాదేవి, పెదపాటి నాగేశ్వరరావు, తలిశెట్టి వెంకటేశ్వరరావులు పిఠాపురంలో పవన్ వచ్చాకా మున్సిపాలిటీకి సంబంధించి ఏం పనులు జరిగాయో చెప్పాలంటూ కమిషనర్ కనకారావును ప్రశ్నించారు. కేవలం పిఠాపురంలో అభివృద్ధి జరుగుతుందన్న ప్రచారం తప్పితే, ఎక్కడా ఏం జరగలేదన్నారు.

గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యిన సందర్బాలను వారు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అనుకున్నామని, కనీసం ప్రజల సమస్యలు తీర్చడంలో పవన్ విఫలమయ్యారన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు ఖర్చుచేసి పనులు చేయడం మాత్రమే జరుగుతుందన్నారు. పవన్ వచ్చిన తర్వాత ఎక్కడా ఆయన మార్కు కనిపించలేదన్నారు. ఆయన ఒక్కసారి పిఠాపురం మున్సిపాలిటిని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. వైసీపీ కౌన్సిలర్ల మాటలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణాభివృద్ధికి రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయించారన్నారు. ఇటీవల ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణ ద్వారా తాము తెలుసుకున్నామన్నామని కౌన్సిలర్లకు సర్ధి చెప్పారు. అయితే పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బహిరంగంగా విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. ఇకపై ఆయనను ఏలా టార్గెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎంని టార్గెట్ చేసిన వారికి జనసేన ఏలా కౌంటర్ ఇస్తుందనేది వేచి చూడాలి.









