సోషల్ మీడియాలో ఎంత గాసిప్స్ తిరిగినా… తారక్–నీల్ ప్రాజెక్ట్ నుంచి మాత్రం ఒక్క చిన్న అప్డేట్ కూడా బయటకు రావడం లేదు. దీంతో అభిమానుల్లో సందేహాలు మరింత పెరుగుతున్నాయి. అసలు “డ్రాగన్” సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అన్న డౌట్స్ కూడా మొదలయ్యాయి. ఒక దశలో ఈ ప్రాజెక్ట్ నిజంగా కొనసాగుతుందా లేదా ఆగిపోయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నా… ఇప్పటికీ టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.
ఇక షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా స్పష్టత లేకపోవడం మరో పెద్ద మైనస్. మధ్యలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను పూర్తిగా మార్చేశారని, స్క్రిప్ట్ మళ్లీ మొదటి నుంచి తయారవుతోందని వచ్చిన రూమర్స్ ప్రాజెక్ట్‌పై నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఇదే సమయంలో తారక్ జిమ్ ఫోటోలు షేర్ చేయగానే… “ఫోటోలు బాగున్నాయి అన్నా, టీజర్ వదిలితే ఇంకా బాగుంటుంది” అంటూ అభిమానులే సెటైర్లు వేయడం పరిస్థితి ఎలా ఉందో చెప్పేస్తోంది.
మరోవైపు కాస్టింగ్ విషయమై కూడా గందరగోళం తక్కువేమీ కాదు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి టొవినో థామస్ తప్పుకున్నట్టు ప్రకటించడంతో… కథ నచ్చకనే బయటకు వచ్చాడా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను కీలక పాత్ర కోసం సంప్రదించారని, అలాగే అలియా భట్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాకుండా తారక్–అలియా కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ షూటింగ్ అప్డేట్ ఒక్కటీ లేకపోయినా… కాస్టింగ్ కథలు మాత్రం వరుసగా రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ సినిమా కథ థాయిలాండ్, లావోస్, మయన్మార్ సరిహద్దుల్లోని “గోల్డెన్ ట్రయాంగిల్” డ్రగ్స్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అందుకే “డ్రాగన్” అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ నెటిజన్స్ మాత్రం “టీజర్ తర్వాత సంగతి… ముందుగా టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
మొత్తానికి ఇంత భారీ అంచనాలున్న సినిమాకు ఈ స్థాయి వీక్ పబ్లిసిటీ నెగెటివ్ ప్రభావం చూపుతుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. చూడాలి మరి… ఈసారి అయినా “డ్రాగన్” టీజర్ బయటకు వస్తుందా? లేక మళ్లీ అదే కథ కొనసాగుతుందా!







