బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ పేరు ఇప్పుడు ఓ భారీ ఆర్థిక కుంభకోణంలో వినిపించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కోట్లాది రూపాయల మోసం కేసులో ఆమెకు కర్ణాటక సీఐడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే… కర్ణాటకకు చెందిన ‘శివమ్ అసోసియేట్స్’ అనే సంస్థ దాదాపు రూ.2,400 కోట్ల మేర అక్రమ డిపాజిట్లు సేకరించి వేలాది మంది ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసును కర్ణాటక సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. 2023లో శివమ్ అసోసియేట్స్ అధినేత నిర్మించిన ‘ఛాంపియన్’ చిత్రంలో సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఆ పాట కోసం ఆమెకు ఏకంగా రూ.1 కోటి పారితోషికం చెల్లించినట్లు బ్యాంక్ లావాదేవీల ద్వారా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అయితే ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన సొమ్మునే ఆమెకు పారితోషికంగా చెల్లించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియజేయాలని కోరుతూ సన్నీ లియోన్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరవుతారా? లేక తన న్యాయ బృందం ద్వారా సమాధానం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే, ఈ సంస్థ గత డిసెంబరులో నిర్వహించిన ‘కన్నడ ఉత్సవం’ కార్యక్రమం కూడా ఇప్పుడు విచారణలో భాగమైంది. ప్రజల సొమ్ముతోనే ఈ వేడుకలు నిర్వహించారా అనే అనుమానాలతో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ ఈవెంట్‌లో పాల్గొని పారితోషికం అందుకున్నారనే అనుమానంతో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసే దిశగా సీఐడీ అడుగులు వేస్తోంది. ఇందులో ‘డాలి’ ధనుంజయ్, ‘కాంతార’ ఫేమ్ సప్తమీ గౌడ, వశిష్ఠ సింహ, రాగిణి ద్వివేది వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.
మరి ఈ భారీ ఆర్థిక కుంభకోణం దర్యాప్తు ఇంకెంతమందిని చుట్టుముడుతుంది? సన్నీ లియోన్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.








