టాలీవుడ్లో సినిమాల పోస్టర్లపై కనిపించే కోట్ల కలెక్షన్లు, మిలియన్ల వ్యూస్, లైక్స్… ఇవన్నీ నిజమేనా? ఈ ప్రశ్నకు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇచ్చిన సమాధానం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సినిమా ప్రమోషన్స్ పేరుతో జరుగుతున్న ఫేక్ నంబర్స్ వ్యవహారంపై ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడారు.
“అసలు పోస్టర్లపై ఆ నంబర్స్ వేయమని ఎవరు అడిగారు?” అంటూ దిల్ రాజు ప్రశ్నించారు. ఒకరు మొదలుపెట్టిన ట్రెండ్‌ను మిగతావాళ్లు కూడా అనుసరించారని, కానీ దీని వల్ల సినిమాకు వచ్చే లాభం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
2015కి ముందు ఇలాంటి కల్చర్ అసలు లేదని, ఆ తర్వాత క్రమంగా ఇండస్ట్రీ అంతా ఇదే ట్రెండ్‌ను ఫాలో అయిందని చెప్పారు. తాను కూడా మొదట్లో అదే చేశానని, కానీ కొన్నేళ్ల తర్వాత అది తప్పు దారిలో వెళ్తోందని గ్రహించి, అప్పటి నుంచి “ఆర్గానిక్ వ్యూస్” మాత్రమే చూపించడం ప్రారంభించానని వెల్లడించారు.
దిల్ రాజు మాటల్లో… ఈ నంబర్స్‌పై ఆసక్తి ఉండేది ఎక్కువగా హీరోల అభిమానులకే తప్ప, సాధారణ ప్రేక్షకులకు కాదన్నారు. డబ్బులు ఖర్చు చేసి వ్యూస్, లైక్స్ పెంచుకోవడం కంటే… కంటెంట్ బాగుంటే ప్రేక్షకులే దాన్ని సూపర్ హిట్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనికి ఉదాహరణగా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలోని “గోదారి గట్టుపైన” పాటను గుర్తు చేశారు. మొదట టీ-సిరీస్ కేవలం 1 మిలియన్ వ్యూస్ మాత్రమే పోస్టర్‌పై చూపించిందని, కానీ ప్రేక్షకుల ఆదరణతో అదే పాట చివరకు 114 మిలియన్ వ్యూస్ దాటిందని తెలిపారు. మంచి కంటెంట్‌కు ఫేక్ ప్రమోషన్స్ అవసరం లేదని స్పష్టం చేశారు.
అంతేకాదు… “గేమ్ చేంజర్” సినిమా కలెక్షన్స్ పోస్టర్లపై కూడా ఆయన స్పందించారు. అప్పట్లో అందరూ చేస్తున్నట్టే తామూ తప్పు చేశామని, కానీ రెండో రోజుకే అది ఫేక్ పోస్టర్ అని ప్రేక్షకులు గుర్తిస్తారని ఒప్పుకున్నారు.
80 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాంటి ఫేక్ కల్చర్ వైపు వెళ్లాల్సిన అవసరం లేదని, కొత్త తరం నిర్మాతలు, దర్శకులు అయినా నిజాయితీతో కూడిన ప్రమోషన్స్ చేయాలని దిల్ రాజు సూచించారు.
మొత్తానికి… దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఫేక్ పోస్టర్లు, ఫేక్ కలెక్షన్లు, ఫేక్ ప్రమోషన్స్‌పై ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.








