ప్రముఖ సినీ నటి రష్మికకు కీలక బాధ్యతలు దక్కాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు నటి రష్మిక మందన్నను ‘జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్’ గా నియమించింది. సైబర్ భద్రత గురించి అవగాహనను బలోపేతం చేయడానికి, భారతదేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ల సమస్యను పరిష్కరించడానికి చేస్తున్న ప్రచారంలో భాగంగా రష్మికకు బాధ్యతలు అప్పగించారు.
సైబర్ బెదిరింపుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రష్మిక దేశవ్యాప్తంగా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.ఆన్లైన్ మోసం, డీప్‌ఫేక్ వీడియోలు, సైబర్ బెదిరింపు, హానికరమైన AI- రూపొందించిన కంటెంట్‌తో సహా వివిధ మోసాల గురించి ప్రజల్లో ప్రచారం కోసం రష్మిక ఇక నుంచి ప్రచారం చేయనున్నారు. రష్మిక మందన్న ఇటీవల డీప్‌ఫేక్ వీడియో ఘటనల ద్వారా ఆవేదన వ్యక్తం చేసారు. నాటి నుంచి మెరుగైన సైబర్ సెక్యూరిటీ ఉండాలని వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో పని చేసే ఈ విభాగానికి రష్మికను అంబాసిడర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అనేక మంది ప్రముఖుల జీవితాలతో పాటుగా సామాన్యులకు ఆందోళనగా మారిన సైబర్ క్రైమ్ పైన కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ క్రమంలో సైబర్ భద్రత గురించి అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించింది. రష్మిక తనకు అప్పగించిన బాధ్యతల పైన స్పందించారు. సైబర్ భద్రత గురించి అవగాహన కల్పించడం మరియు ప్రచారం చేయడం కోసం నేను అంకితభావంతో ఉన్నానని వెల్లడించారు. ప్రతీ ఒక్కరి మద్దతు.. సహకారం అవసరమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రష్మిక కొత్త పాత్రలో జాతీయ స్థాయిలో పని చేయటం ప్రారంభించనున్నారు.









