హైదరాబాద్ నగరంలోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న అద్దె విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, ఇకపై మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సెంటేజీ విధానంలో సినిమాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి.
ఈ మార్పు నగరంలోని 23 థియేటర్లలో శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.
ఇంతకాలం డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకు రోజువారీ లేదా వారాంత అద్దె చెల్లిస్తూ సినిమాలను ప్రదర్శించేవారు. అయితే, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు వంటి కారణాలతో ఈ విధానం భారంగా మారిందని థియేటర్ యాజమాన్యాలు పేర్కొన్నాయి. దీంతో థియేటర్ల మనుగడ కష్టంగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త విధానం ప్రకారం సినిమా వసూళ్లలో వాటాను ఇలా పంచుకోనున్నారు:
మొదటి వారం – 60% డిస్ట్రిబ్యూటర్లకు
రెండో వారం – 50%
మూడో వారం – 40%
మిగిలిన మొత్తాన్ని థియేటర్ యజమానులు పొందుతారు.
ఈ నిర్ణయానికి ప్రముఖ పంపిణీదారులు సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన పంపిణీదారు శశిధర్ రెడ్డి ఈ విధానానికి అంగీకరించలేదని సమాచారం.
ప్రస్తుతం 23 థియేటర్లలో ప్రారంభమైన ఈ పర్సెంటేజీ విధానాన్ని దశలవారీగా తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు విస్తరించే యోచనలో ఉన్నట్లు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది.








