ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై ఫోకస్ పెట్టారు. ఈ సినిమాను 2027 డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఆ పోస్టర్లను చూస్తే ఈ ప్రాజెక్ట్‌ను అట్లీ ఎంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడో స్పష్టంగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ తన ప్రాజెక్ట్స్‌ను వేగంగా పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఒక సినిమా పూర్తి కావడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతున్న నేపథ్యంలో, ఇకపై అలా కాకుండా వరుసగా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో బన్నీ కొత్త స్ట్రాటజీ అమలు చేయబోతున్నారని సమాచారం.
దీనిలో భాగంగా ఆయన దర్శకులకు ఒక కీలక కండిషన్ పెట్టారట. తాను చేసే ప్రతి సినిమా షూటింగ్‌ను గరిష్టంగా 200 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి సినిమా పూర్తికాకపోతే, అదే సమయంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా సమాంతరంగా కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ విధానం ద్వారా ఎక్కువ సినిమాలు చేయాలని బన్నీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్ మరో మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చే ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, 2027లో బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి, అల్లు అర్జున్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఆయన కెరీర్‌లో అవుట్‌పుట్‌ను పెంచేలా కనిపిస్తోంది. అభిమానుల్లో కూడా దీనిపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఇంత తక్కువ సమయంలో భారీ సినిమాలను పూర్తి చేయడం ఎంతవరకు సాధ్యమవుతుందన్నది మాత్రం చూడాలి.








