పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పదేళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్-హరీశ్ శంకర్ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌తో ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్స్ ఊపందుకున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే $250K (సుమారు రూ. 2.1 కోట్లు) మార్కును దాటేసి రికార్డులు సృష్టిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు భారీ ఊరటనిస్తూ టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా పెంచుకోవడానికి జీవో జారీ చేసింది. అలాగే ఉగాది రోజున తెల్లవారుజామున 4 గంటలకు పడే బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించింది. పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
తెలంగాణలో మాత్రం టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ రేట్లకే బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ మొదటి షో ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫైనల్ అవుట్‌పుట్‌పై దర్శకుడు హరీశ్ శంకర్ పూర్తి ధీమాతో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఎనర్జీ, డైలాగ్స్ అభిమానులకు విందు భోజనంలా ఉంటాయని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఉగాది పండగ సెలవులు కలిసి వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.








