ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) ఆటలో వేగాన్ని పెంచే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న 21 పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని మార్చాలని యోచిస్తోంది. దీని స్థానంలో 3×15 లేదా 5×11 పాయింట్ల పద్ధతిని తీసుకురావాలనే ప్రతిపాదనపై ఏప్రిల్ 25న డెన్మార్క్‌లో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే, ఈ మార్పులపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ అంటే కేవలం వేగం మాత్రమే కాదని, అది ఆటగాళ్ల ఓర్పుకు మరియు ఫిట్‌నెస్‌కు పరీక్ష అని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 21 పాయింట్ల విధానమే అత్యంత సమతుల్యంగా ఉందని, గత కొన్నేళ్లుగా ఆటగాళ్లందరూ దీనికే అలవాటు పడ్డారని సైనా విశ్లేషించారు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని, సుదీర్ఘమైన ర్యాలీలు ఆడటంలోనే క్రీడాకారుల నైపుణ్యం బయటపడుతుందని ఆమె గుర్తు చేశారు. స్కోరింగ్ పాయింట్లు తగ్గించడం వల్ల ఆటలో తీవ్రత తగ్గే అవకాశం ఉందని, ఇది పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు
బిడబ్ల్యూఎఫ్ కేవలం వాణిజ్య పరమైన ప్రయోజనాలు లేదా ఆట వేగాన్ని మాత్రమే కాకుండా, క్రీడాకారుల సంక్షేమం మరియు ఆట స్ఫూర్తిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సైనా కోరారు. స్కోరింగ్ విధానంలో మార్పులు చేసే ముందు క్రీడాకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో జరగబోయే సమావేశంలో ఈ ప్రతిపాదన వీగిపోతుందా లేక కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయా అన్నది ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
2016లో, ఆమెకు భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ ను దక్కించుకున్నారు. ఆమె దేశంలోని రెండు అగ్ర క్రీడా గౌరవాలు, మేజర్ ధ్యాన్ చంద్, ఖేల్ రత్న అవార్డులతోపాటు, అర్జున అవార్డులను కూడా అందుకున్నారు. నెహ్వాల్ ఒక పరోపకారి, 2015లో అత్యంత దాతృత్వ అథ్లెట్ల జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత చివరిసారిగా 2023 సింగపూర్ ఓపెన్‌లో పోటీ మ్యాచ్ ఆడిన నెహ్వాల్, జనవరి 2026 బ్యాట్మింటన్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. భారతదేశంలో అత్యంత విజయవంతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణిలలో ఒకరిగా పేరుగాంచిన నెహ్వాల్, దేశంలో బ్యాడ్మింటన్ ప్రజాధారణ పెంచడంలో కీలక పాత్ర పోషించారు . రిటైర్మెంట్ తర్వాత కూడా ఆమె సేవలు కొనసాగిస్తున్నారు. గత అనుభవాలను పంచుకుంటూ, జూనియర్లకు సహకారం అందిస్తున్నారు.







