‘రంగస్థలం’ టైమ్‌లో రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరూ ఒకే మైండ్‌సెట్‌లో ఉన్నారు.. “ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి” అనే కసి. అదే కసి చిట్టిబాబు లాంటి ఐకానిక్ క్యారెక్టర్ని పుట్టించింది. కానీ ఇప్పుడు RC17 దగ్గరికి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు ఎదగాలనే ఆకలి ఉంటే.. ఇప్పుడు స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవాలనే ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది.
2018లో ‘రంగస్థలం’ విడుదలకు ముందు చరణ్ కెరీర్ అంత స్ట్రాంగ్ పొజిషన్లో లేదు. ‘ధృవ’ మంచి పేరు తెచ్చుకున్నా.. మాస్ లెవెల్లో భారీ బ్లాక్‌బస్టర్ మాత్రం కావాలి. మెగా హీరో అనే ట్యాగ్ ఉన్నా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చరణ్ బలంగా ప్రయత్నిస్తున్న టైమ్ అది. మరోవైపు సుకుమార్ కూడా ‘1 నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’ తర్వాత కమర్షియల్‌గా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఆ ఇద్దరి ప్రెజర్, ఆ ఇద్దరి ఆకలి కలిసి ‘రంగస్థలం’ని ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చాయి. వినికిడి లోపం ఉన్న పల్లెటూరి యువకుడిగా చరణ్ చూపించిన నటన ఇప్పటికీ అభిమానులను మెప్పిస్తూనే ఉంది.
ఇప్పుడు 2026కి వస్తే.. ఇద్దరి స్టేటస్ పూర్తిగా మారిపోయింది. సుకుమార్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. చరణ్ ‘RRR’తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు. కానీ అదే సమయంలో ఇద్దరికీ కొత్తరకమైన ఒత్తిడి కూడా మొదలైంది. ‘RRR’ తర్వాత చరణ్‌కు సోలోగా భారీ హిట్ రాలేదు. ‘ఆచార్య’ నిరాశపరిచింది.. ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ అయింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది’పై పడింది.
ఒకవేళ ‘పెద్ది’ ఆశించిన స్థాయిలో ఆడకపోతే.. RC17 చరణ్ కెరీర్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు సుకుమార్‌పై కూడా ‘పుష్ప 2’ స్థాయిని మించి చూపించాలనే ఒత్తిడి ఉంటుంది.
అయితే అసలు ప్రశ్న ఏంటంటే.. ‘రంగస్థలం’ టైమ్‌లో చూపించిన ఆ రిస్క్ తీసుకునే ధైర్యం ఇప్పుడు కూడా ఉంటుందా? అప్పట్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్, 80ల సెటప్, హీరోకి లోపం వంటి కమర్షియల్ ఫార్ములాకి విరుద్ధమైన అంశాలతో సినిమా చేశారు. కానీ ఇప్పుడు స్టార్ ఇమేజ్, మార్కెట్ లెక్కలు, ఫ్యాన్స్ అంచనాలు అన్నీ భుజాలపై ఉన్నాయి.
సుకుమార్ బలం ఎప్పుడూ క్యారెక్టర్లే. చిట్టిబాబు, పుష్పరాజ్ లాంటి సాధారణ వ్యక్తులను అసాధారణ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. RC17లో కూడా చరణ్ కోసం అలాంటి రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ రాస్తేనే ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ముంబైలో లుక్ టెస్ట్ జరిగిందనే వార్తలతో ఈసారి కథ మోడర్న్ సెటప్‌లో ఉండొచ్చనే చర్చ కూడా మొదలైంది.
ఏదేమైనా.. స్టార్డమ్ వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోతే కథలోని ఆత్మ మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ‘పెద్ది’ ఫలితం ఎలా ఉన్నా.. RC17 మొదలయ్యే ముందు చరణ్, సుకుమార్ ఇద్దరూ మరోసారి 2018 మైండ్‌సెట్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే ‘రంగస్థలం’ మ్యాజిక్ మళ్లీ కనిపిస్తుంది. లేదంటే అది కేవలం మరో భారీ బడ్జెట్ సినిమాగా మాత్రమే మిగిలిపోతుంది.









