సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘తెలుసు కదా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వైఫల్యంపై హీరోయిన్ రాశీ ఖన్నా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో షూటింగ్ జరుగుతున్నప్పుడే తనకు ఒక అవగాహన వచ్చేసిందని ఆమె బహిరంగంగా వెల్లడించారు. స్క్రిప్ట్‌లో కొన్ని అంశాలు తనకు నచ్చలేదని, ఆ విషయాలను దర్శకురాలికి చెప్పినప్పటికీ ఆమె విజన్‌పై నమ్మకంతో ముందుకు వెళ్లాల్సి వచ్చిందని రాశీ పేర్కొన్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో తనకు అప్పట్లోనే కొన్ని అనుమానాలు ఉన్నాయని రాశీ ఖన్నా తెలిపారు. “క్లైమాక్స్ అందరూ మెచ్చేలా ఉండాలని నాకు అనిపించింది, అందుకే అందులోని ఆపరేషన్ సీన్ చేయనని చెప్పాను. కానీ చివరికి తప్పలేదు” అని ఆమె వివరించారు. షూటింగ్ ముందుకు వెళ్తున్న కొద్దీ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు జరిగాయని, ఆ సమయంలో నటిగా తన చేతుల్లో ఏమీ లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా ద్వారా తన అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాలని ఒక గుణపాఠం నేర్చుకున్నానని రాశీ వెల్లడించారు.
ప్రస్తుతం రాశీ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక సినిమా పరాజయం పాలైన తర్వాత హీరోయిన్ ఇంత ఓపెన్‌గా స్పందించడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాశీ ఖన్నా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించగా, ఆమె నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









