టాలీవుడ్‌లో ‘దసరా’తో సంచలన విజయాన్ని అందుకున్న నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పారడైజ్’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాపై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో ప్రత్యేకమైన కనెక్షన్ ఉండబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
తాజా సమాచారం ప్రకారం, శ్రీకాంత్ ఓదెల ‘పారడైజ్’ తర్వాత చిరంజీవితో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కేవలం దర్శకుడి ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా, ఒకే కథా ప్రపంచానికి చెందినవిగా ఉండే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన LCU తరహాలో, శ్రీకాంత్ ఓదెల కూడా తనదైన సినిమాటిక్ యూనివర్స్‌ను ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘పారడైజ్’ క్లైమాక్స్‌లోనే చిరంజీవి సినిమాకు సంబంధించిన కీలక హింట్ ఇవ్వబోతున్నారట. సినిమా ముగిసే సమయంలో మెగాస్టార్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సర్ప్రైజ్ లీడ్‌ను చూపిస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచేలా క్లైమాక్స్‌ను డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అంతేకాదు, ‘పారడైజ్’ కథను మరింత విస్తరించే ఆలోచనలో కూడా ఉన్నారట శ్రీకాంత్ ఓదెల. ఇందులో భాగంగా ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను కూడా రూపొందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ ప్రీక్వెల్ ద్వారా ప్రధాన కథ ప్రారంభమైన నేపథ్యాన్ని ప్రేక్షకులకు చూపించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ‘పారడైజ్’, చిరంజీవి నెక్స్ట్ మూవీ, అలాగే ప్రీక్వెల్ ప్రాజెక్ట్‌లను ఒకే యూనివర్స్‌లో అనుసంధానం చేస్తూ శ్రీకాంత్ ఓదెల సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ బజ్ మాత్రం ప్రస్తుతం నాని, మెగా అభిమానుల్లో భారీ చర్చకు దారితీస్తోంది.









