ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తాను ఇంత భారీ స్క్రీన్‌తో మల్టీప్లెక్స్ నిర్మించడానికి రెండు ముఖ్యమైన ప్రేరణలు ఉన్నాయని వెల్లడించారు. మొదటిది, యూవీ క్రియేషన్స్ వంశీ సూళ్లూరుపేటలో నిర్మించిన అతిపెద్ద థియేటర్ కాగా, రెండోది ఒక బడా వ్యాపారవేత్త ‘మిషన్ ఇంపాజిబుల్ 6’ సినిమా టికెట్ల కోసం ఇబ్బంది పడటం చూసి, ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి స్క్రీనింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని నిర్మించినట్లు తెలిపారు. సుమారు రెండేళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ కల సాకారమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మల్టీప్లెక్స్‌లో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా డాల్బీ విజన్ టెక్నాలజీతో కూడిన బిగ్ స్క్రీన్ కోసం 72 స్పీకర్లు మరియు 165 సౌండ్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేశారు. కేవలం ఈ సౌండ్ సిస్టమ్‌ను పకడ్బందీగా అమర్చడానికే సుమారు 9 నెలల సమయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. మొత్తం నాలుగు స్క్రీన్లు అందుబాటులో ఉండగా, ప్రధాన థియేటర్ 600కు పైగా సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను నిర్ణయించడం విశేషం. గరిష్ఠంగా టికెట్ ధర 450 రూపాయలుగా ఉండనుంది. శనివారం నుంచి ఈ థియేటర్ సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందిన ఈ అల్లు సినిమాస్, హైదరాబాద్ సినిమా హాల్స్ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలవనుంది.









