తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం (జూలై 13) హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన వయసు 83 సంవత్సరాలు…1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు, సినిమాల్లోకి రాకముందు భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పని చేశారు. రంగస్థలంలో తన నటనతో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ఆయన, ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టారు…నలభై సంవత్సరాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో నటించిన కోట గారు, ప్రతిఘటన, అహనా పెళ్లంట, ఖైదీ నంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, అతడు, బొమ్మరిల్లు, రేసుగుర్రం వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో తన అభినయంతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. “అహనా పెళ్లంట” లో పిసినారి పాత్ర, తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది..అగ్రహీరోలు కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తదితరులతో కలిసి ఆయన పనిచేశారు. సహాయ పాత్రలు, ప్రతినాయక పాత్రలు, హాస్యభరిత పాత్రలు .అన్నింటినీ తనదైన శైలిలో పోషించారు..1968లో రుక్మిణిని వివాహం చేసుకున్న కోట గారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మరణించాడు..కోట శ్రీనివాసరావు గారి మృతిపట్ల సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షక లోకం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి..









