మహాకుంభ మేళా కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 13న ప్రారంభం కానున్న మహా కుంభ మేళా ఫిబ్రవరి 26 న ముగియనుంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు రూ 7500 కోట్లు ఖర్చు చేస్తోంది. భక్తుల కోసం తాత్కిలిక వసతితో పాటుగా ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు కుంభేమళాకు తరలి రానున్నారు. ఇదే సమయంలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. సినీ రంగ ప్రముఖులు వచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సర్వం సిద్దం
ఈ ఏడాది కుంభమేళా కు దాదాపు 45 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందులో సాధారణ భక్తుల మొదలు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే కుంభ మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా విమానాలు, రైళ్లు ఏర్పాటు చేసారు. రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు కుంభ మేళాకు వచ్చేందుకు ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారు. తొలి 20 రోజులు అత్యంత పవిత్రమైనవి గా భావిస్తారు. దీంతో, తొలి 20 రోజుల్లోనే ప్రముఖులు స్నానం కోసం తరలి రానున్నారు.
రానున్న సినీ ప్రముఖులు
అందులో భాగంగా బాలీవుడ్ తో పాటుగా తెలుగు, దక్షిణాది సినీ ప్రముఖులు కుంభ మేళాకు తరలి వస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, యువ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్, నటి రాఖీ సావంత్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవ్ సహా తదితరులు వస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. వీరంతా ఈ సారి మహా కుంభ మేళాలో గంగానదిలో స్నానానికి ప్రయాగ్‌రాజ్ వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ సారి కుంభమేళా లో ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ నాలుగు పవిత్ర స్థలాలకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
ప్రత్యేక ఏర్పాట్లు
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ్ దేశంలో జరిగే అతి పెద్ద కార్యక్రమం. అందు నా.. ప్రయాగ్‌రాజ్ మహాకుంభం అత్యంత విశిష్టమైనది. ఈ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాల సంగమం ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ మహాకుంభానికి నిత్యం కోట్లాది మంది భక్తులు వస్తారనే అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా వీరికి అధిక స్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రవాణా, ట్రాఫిక్, రద్దీ నిర్వహణ, భద్రత కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి అక్కడ బాధ్యతలు కేటాయించారు.









