సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో కలిసి పనిచేయాలని ఐఐటీ మద్రాసుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదర్చుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలో అంతర్జాతీయ డీప్‌టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీసీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది.
సముద్ర పరిశోధన, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీస్, కమ్యూనికేషన్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై ఐఐటీ మద్రాసు-ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం ఫోకస్ చేయగా.. సముద్ర పరిశోధనలతోపాటు విద్య, శిక్షణ, కన్సల్టెన్సీ సేవలు అందించే ఉద్దేశం కూడా ఉంది. స్వయం ప్లస్, ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫాంల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. విమానాశ్రయాలను, లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఇన్వెస్టిమెంట్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖపట్నం మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేసేలా ఒప్పందం చేసుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్‌వేర్ మౌలిక సదుపాయాలను మెరుపర్చేందుకు ఒప్పందం కుదిరింది. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు క్రీడల శాఖ ఒప్పందం చేసుకుంది.
అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఐఐటి మద్రాసు ప్రతినిధులతో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చించిన అనంతరం కీలక ఒప్పందాలు మంత్రి లోకేష్ సమక్షంలో జరిగాయి. ఏపీ సీఆర్డీఏ, మ్యారీ టైం బోర్డు, స్కిల్ డెవలప్ మెంట్, విద్య, ఇన్వెస్టిమెంట్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఐటి, ఆర్టీజిఎస్ శాఖలతో ఐఐటి మద్రాస్ ఒప్పందాలు కుదిరాయని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.