భారత్ రాష్ట్ర సమితి.. కొంతకాలంగా వలసల బెడదను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనే తేడా ఉండట్లేదు. పార్టీ నుంచి బయటికి వెళ్లడానికి వరుస కట్టారు. అధికార కాంగ్రెస్ వైపు కొందరు, భారతీయ జనతా పార్టీలోకి మరి కొందరు చేరిపోతున్నారు
ఇప్పటివరకు మొత్తం తొమ్మిదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల, టీ ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్, అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి ఉన్నారు.
తాజాగా హరీష్ రావు కూడా పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి నిజం కాకపోయినప్పటికీ కొద్దిరోజులగా చర్చల్లో ఉంటూ వస్తోంది. మొన్నటికి మొన్న వన్ ఇండియా తెలుగుకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దీనిపై స్పందించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూడా ఇదే విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఓ అడుగు ముందుకేశారు కూడా. హరీష్ రావును గుడ్ పొలిటీషియన్‌గా ప్రశంసించారు. అదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమౌతుందంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు- తమ పార్టీలోకి రావాలనుకుంటే రావొచ్చని బండి సంజయ్ చెప్పారు. రాజీనామా చేసి బీజేపీలో చేరాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆయన అనే కాదు ఎవరు తమ పార్టీలో చేరాలనుకున్నా రాజీనామా తప్పదని పేర్కొన్నారు. తమ పార్టీ జెండా కింద పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకునే సత్తా కార్యకర్తలకు ఉందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు తోపులు అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్‌లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా పార్టీ ఫిరాయించడానికే ప్రయత్నిస్తోన్నారని బండి సంజయ్ అన్నారు. ఏముందని బీఆర్ఎస్‌లో కొనసాగడానికి.. అంటూ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఎనిమిది స్థానాలను గెలిచామని, బీఆర్ఎస్ ఎన్ని గెలిచిందని ప్రశ్నించారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం వల్ల అందరూ బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
పాపం ఆ పెద్దాయన (కేసీఆర్) ఇప్పటికే గిట్ల పట్టుకుని కూసున్నడు. ఇప్పుడు హరీష్ రావు బీజేపీలో చేరుతుండు అంటూ బ్రేకింగ్ వేస్తే ఏదైనా అయితే మీద పడతది..ఆ పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే పయత్నం చేయకున్రి.. అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తిని అని చెప్పారు.