ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో తలుపులమ్మలోవ దేవాలయం ఒక్కటి. ఆషాడ మాసంలో ఇక్కడ అమ్మవారిని నిత్యం ప్రత్యేక ఆలంకరణ చేశారు. ఒంటినిండా గాజులు, కూరగాయాలు ఇలా వివిధ రకాల ఆలంకరణలలో అమ్మవారు నెలరోజులు పాటు దర్శనమిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. కోళ్లు, మేకలను కూడా బలిస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే వండుకుని తిని, అక్కడ సేద తీరుతారు. పురాతన కాలం నుండి ఈ ఆచారం కొనసాగుతుంది. పేరులో మాత్రం తలుపులమ్మ అని పిలిచినప్పటికీ ఆమె తలంపులమ్మ అనే నామకరణంతో ఇక్కడ కొలువైయున్నారని పండితులు చెబుతున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆషాడ మాసంలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.
మంగళవారం, ఆదివారం సమయాల్లో ఆలయం రద్దీగా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రూమ్ సౌకర్యం ఉంటుంది. ఆన్‌లైన్ కూడా బుకింగ్స్ ఉంటాయి. మొక్కులు తీర్చుకున్న తర్వాత అక్కడే భోజనం వండుకుని తిందామనుకునే వారికి అన్ని సౌకర్యాలు దొరకుతాయి. ప్రత్యేకంగా మాంసాహారం వండే వంట మనుషులు కూడా ఉంటారు. ఆహారం కావాల్సిన వారి సంఖ్యను బట్టి వండుకునే సామాగ్రిని వారే సమకూరుస్తారు. మంచి తాగునీరు కూడా సమీపంలోనే ఉంటుంది. తలుపులమ్మ కొండపైనా, కింద కూడా భక్తులు సేద తీరే వెసులు బాటు ఉంటుంది.
విశాఖపట్నం నుండి విజయవాడ మార్గం వైపు వెళ్లే వారు తుని రైల్వేస్టేషన్‌లో దిగి తలుపులమ్మలోవ ఆలయానికి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. విశాఖ నుండి నేషనల్ హైవే మార్గంలో బస్సుల సౌకర్యం కూడా ఉంటుంది. అన్నవరం క్షేత్రానికి చాలా తక్కువ దూరంలో తలుపులమ్మ ఆలయం ఉంటుంది. బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి.