రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ పునాదుల్లో వణుకుపుడుతోంది. ఇందుకు వారు ముందస్తుగా రక్షణ చర్యలకు దిగుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని, భద్రత పెంచాలని ఎక్కడికక్కడ మొరపెట్టుకుంటున్నారు. ఇటీవల జగన్ కు సెక్యూరిటీ ని కొత్త ప్రభుత్వం తగ్గించింది. ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో ఆయనకున్న భద్రతను వెనక్కి తీసుకుంది. దీంతో ఆయన ప్రైవేటు సెక్యూరిటీని ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే తమకు భద్రత పెంచాలని, తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. తమకు భద్రత పెంచాలని తండ్రి కొడుకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రిగా ఉన్నసమయంలో మంత్రి పెద్దిరెడ్డికి 5+5 భద్రత ఉండేది.ప్రస్తుతం1+1 సెక్యూరిటీ మాత్రమే ప్రభుత్వం కల్పిస్తుంది. తమకు భద్రత పెంచాలని కోర్టును కోరారు. తమ భద్రతపై సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.
గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డికి 5+5 భద్రత కల్పించిందని, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి 1+1 భద్రత ఏర్పాటు చేశామని కోర్టు దృష్టికి ప్రభుత్వం తెలిపింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.