రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూలై 1న ఎన్టీఆర్ భరోసా ఫించన్ పంపిణీకి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు.కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా గ్రామీణ అభివృద్ధి(డీఆర్డీఏ), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఫించన్ల పంపిణీతోపాటు, చంద్రన్న బీమా క్లెయిమ్స్ పరిష్కారం, స్త్రీ నిధి, ఉన్నతి, సున్నా వడ్డీ కింద మంజూరు చేసిన రుణాలు వివరాలు, స్వయం సహాయక సంఘాలు, సభ్యులకు స్వయం ఉపాధి నిమిత్తం కల్పిస్తున్న సదుపాయాలు తదితర అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లను రానున్న జూలై నెల నుంచి ఎన్టీఆర్ భరోసా పేరుతో పంపిణీ చేపట్టనున్నదన్నారు. జూన్ నెలలో సామాజిక భద్రత పింఛన్ల కింద జిల్లాలో 2,79,805 మందికి రూ.82.90 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో 17 రకాల పింఛన్లు జిల్లాలో 2,79,319 మందికి రూ188.40 కోట్ల పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు వేలు, నూతనంగా పెంచిన ఫించన్ సొమ్ము నాలుగు వేలుతో కలిపి మొత్తం రూ. 7వేలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో ఫించన్ సొమ్ము పంపిణీ ఉంటుందన్నారు.
సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రొజెక్ట్ డైరెక్టర్ కె.శ్రీరమణి, పట్టణ ప్రజలకు నిర్మూలన సంస్థ ప్రొజెక్ట్ డైరెక్టర్ బి.ప్రియంవద, డీపీఎంలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం అమరావతి సీఎస్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరాబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు.